
బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర గారి మరణ వార్తలు మంగళవారం (నవంబర్ 11, 2025) ఉదయం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ధర్మేంద్ర ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని సమాచారం.
ఉదయం కొన్ని మీడియా సంస్థలు మరియు సోషల్ మీడియా హ్యాండిల్స్ ఆయన మరణించారని పేర్కొన్నప్పటి నుంచి దేశవ్యాప్తంగా అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తరువాత ధర్మేంద్ర కుమార్తె ఈషా దియోల్ సోషల్ మీడియాలో స్పష్టంగా స్పందిస్తూ, “దయచేసి తప్పుడు వార్తలు స్ప్రెడ్ చేయొద్దు, మా నాన్న గారు స్థిరంగా ఉన్నారు, కోలుకుంటున్నారు. మీ ప్రార్థనలకు ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.
అలాగే ఆయన భార్య, ప్రముఖ నటి హేమామాలిని కూడా స్పందిస్తూ, ఈ తప్పుడు ప్రచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ, “ఇలాంటి అసత్య వార్తలు పంచడం బాధ్యతారాహిత్యం. ధర్మేంద్ర గారు చికిత్స పొందుతున్నారు, మంచి స్పందన చూపిస్తున్నారు” అని వెల్లడించారు.
ఆసుపత్రి వర్గాలు కూడా ధర్మేంద్ర ప్రస్తుతం స్థిరంగా ఉన్నారని, వెంటిలేటర్‌పై లేరని వెల్లడించాయి.
