భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ కరోనావైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ఈ వేరియంట్ 11 రాష్ట్రాలకు పాకింది. ఇంతవరకు మొత్తం 101 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
అత్యధికంగా మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు కాగా 22 కేసులతో దిల్లీ రెండో స్థానంలో ఉంది. రాజస్థాన్‌లో 17, కర్ణాటకలో 8, తెలంగాణలో 8, గుజరాత్లో 5, కేరళలో 5 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, చండీగఢ్‌లలో ఒక్కో కేసు నమోదైంది. ఈ ఏడాది నవంబర్ మధ్యలో, దక్షిణ ఆఫ్రికాలోని బోట్సువానాలోని శాస్త్రవేత్తలు కొత్త రకం కోవిడ్ వైరస్ నమూనాలను పరిశీలిస్తున్నారు. వైరస్ స్పైక్ ప్రోటీన్‌లో ఇంతకుముందు చూడని అనేక ఉత్పరివర్తనాలను వారు గుర్తించారు.
అక్కడికి మూడు వారాల్లోనే, ఈ వైరస్ వేరియంట్ 70 కంటే ఎక్కువ దేశాలకు పాకింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వేరింయట్కు B.1.1.529 ఒమిక్రాన్ అని పేరు పెట్టింది. ఇది ప్రమాదకరమైన, జాగ్రత్త పడాల్సిన అంశంగా ప్రకటించింది. శుక్రవారం నాటికి ఈ వేరియంట్ 91 దేశాల్లో కనిపించింది. దీనికి ముందు వచ్చిన డెల్టా వేరియంట్‌కన్నా ఇది వేగంగా వ్యాప్తి చెందుతోందని, అయితే ఇది ప్రాణాంతకమా కాదా అన్నది తెలుసుకోవడానికి ఇంకా కొంత సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
18 నెలల క్రితం కరోనా తొలి కేసు నమోదైంది. అప్పటి నుంచి ఇందులో చాలా మ్యుటేషన్లు వచ్చాయి. ఆల్ఫా కంటే డెల్టా ప్రాణాంతకమైంది. కాబట్టి, దాని తర్వాత వచ్చిన ఒమిక్రాన్ గురించి ఆందోళనలు సహజమే. ”ఇటీవలి నెలల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు కోవిడ్ నుంచి బయటపడ్డారు. టీకాలు కూడా పెద్ద సంఖ్యలో వేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో వ్యాధి మళ్లీ విస్తరిస్తే, టీకాలు తీసుకున్నవారు, వైరస్ నుంచి బయటపడిన వారు ఈ వ్యాధిని నివారించగలరని భావించవచ్చు’’ అని ప్రొఫెసర్ రిచర్డ్ లెజెల్స్ అన్నారు. ఆయన దక్షిణాఫ్రికాలోని క్వాజులు-నాటల్ విశ్వవిద్యాలయంలో అంటు వ్యాధి నిపుణుడిగా పని చేస్తున్నారు.
“మొదట్లో ఇన్ఫెక్షన్ కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతారని అనుకున్నారు. వారిలో కూడా 10 నుండి 30 సంవత్సరాల వయస్సు గల యువకులు ఉంటారని, వారు ప్రమాదంలో ఉన్నారని భావించారు. కానీ మాకు అర్థమైనదేంటంటే, వారు పూర్తిగా టీకాలు తీసుకోకపోయినా, తీవ్రమైన అనారోగ్యానికి మాత్రం గురి కాలేదు” అన్నారాయన.
