కరోనా దక్షిణాఫ్రికా వేరియంట్: సరిహద్దులు మూసేస్తున్న దేశాలు.. విమాన ప్రయాణాలపై ఆంక్షలు

ఈ వారం ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో కొత్త కరోనా వేరియంట్ బయటపడింది. ఈ కొత్త వేరియంట్‌ను B.1.1.529 అని పిలుస్తున్నారు.

ఇది మునుపటి వాటికన్నా చాలా ఎక్కువగా ఉత్పరివర్తనం చెందింది. ఇది “చాలా భయంకరమైనదని” శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటివరకు మనం చూసిన వేరియంట్లలో ఇదే అత్యంత దారుణమైందని అంటున్నారు. దాంతో పలు దేశాలు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తమ సరిహద్దులను మూసేస్తున్నాయి. విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి.

దక్షిణాఫ్రికా, దాని చుట్టుపక్కలున్న దేశాల నుంచి విమానాల రాకపోకలపై బ్రిటన్, సింగపూర్, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, మొజాంబిక్ తాత్కాలికంగా నిషేధం విధించాయి. ఈ కొత్త వేరియంట్ గురించి శాస్త్రవేత్తలు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. కానీ ఈ వేరియంట్‌పై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొత్త వేరియంట్ ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని వారాల సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ – డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది. ఈ వేరియంట్ అత్యధికంగా ఉత్పరివర్తనం (మ్యూటేషన్) చెందిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సీన్లు దానిపై ప్రభావం చూపలేకపోవచ్చు.

ఎందుకంటే ఇప్పుడున్న వ్యాక్సీన్లు వూహాన్‌కు చెందిన ఒరిజినల్ స్ట్రెయిన్ ఆధారంగా తయారు చేసినవి. కానీ ఈ కొత్త వేరియంట్ చాలా ఎక్కువగా ఉత్పరివర్తనం చెందిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వేరియంట్‌కు ఇంకా పేరు పెట్టలేదు. దీన్ని ప్రస్తుతం B.1.1.529 అని పిలుస్తున్నారు. వచ్చే శుక్రవారం దీనికొక పేరు పెట్టే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.

Related Articles

Latest Articles