
భారత దేశం ప్రతి సంవత్సరం డిసెంబర్ 4ను ఇండియన్ నేవీ డేగా జరుపుకుంటుంది. ఈ సందర్బంగా దేశం మొత్తం నౌకాదళ వీరులకు సలాములు అర్పిస్తోంది. సముద్ర మార్గాల్లో దేశాన్ని రక్షించే భారత నౌకాదళం శక్తి, నియంత్రణ, క్రమశిక్షణ, సేవాభావానికి గుర్తుగానే ఈ వేడుక నిర్వహించబడుతుంది.
ఈ రోజు 1971 ఇండో-పాక్ యుద్ధంలో జరిగిన ఆపరేషన్ ట్రైడెంట్ విజయాన్ని స్మరించుకుంటూ నిర్వహిస్తారు. ఆ ఆపరేషన్‌లో భారత నౌకాదళం పాకిస్థాన్ నేవీకి పెద్ద దెబ్బ కొట్టి, కరాచి నౌకాశ్రయాన్ని స్తంభింపజేసింది. ఈ విజయంతో ప్రపంచం భారత నౌకాదళ శౌర్యాన్ని గుర్తించింది.
నేడు నేవీ డే సందర్భంగా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నౌకాదళ సైనికులు తమ శక్తి, సామర్థ్యాలను ప్రదర్శిస్తుండగా, సముద్ర మార్గాల్లో జరుపుతున్న పహారా, ఆధునిక యుద్ధ నౌకలు, సబ్‌మరిన్లు, వాయు విభాగం సామర్థ్యాలు ప్రజలకు చూపిస్తున్నారు. ముఖ్య నౌకా స్థావరాల్లో ప్రత్యేక వేడుకలు, పరేడ్‌లు, సముద్ర విన్యాసాలు జరుగుతున్నాయి.
ప్రధాన నగరాల్లోని నేవీ కేంద్రాలు ప్రజలకు తెరవబడి, పిల్లల నుండి పెద్దల వరకు అందరూ నౌకాదళం ఎలా పనిచేస్తుందో ప్రత్యక్షంగా చూసే అవకాశం పొందుతున్నారు. అధికారులు దేశ భద్రతలో సముద్ర సరిహద్దుల ప్రాధాన్యం, నౌకాదళం నిర్వహిస్తున్న సేవలు, సహాయ కార్యక్రమాలు వివరించారు.
జాతీయ నాయకులు, ప్రముఖులు నేవీ సిబ్బందికి శుభాకాంక్షలు తెలుపుతూ, దేశ భద్రతలో వారి పాత్రను ప్రశంసించారు. సముద్రాల్లో, తీరప్రాంతాల్లో, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను రక్షించడంలో నౌకాదళం చూపుతున్న సేవలను దేశం గర్వంగా గుర్తిస్తోంది.
ఇండియన్ నేవీ డే సందర్భంగా భారత ప్రజలు నౌకాదళ సైనికుల ధైర్యాన్ని, త్యాగాన్ని, సేవా భావాన్ని స్మరించుకుంటూ వారికి వందనం చేస్తున్నారు.
