ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రరూపం దాల్చడంతో ఉత్తరాంధ్ర, ఒడిశాలలో వర్షాలు ప్రారంభమయ్యాయి.
శుక్రవారం మధ్యాహ్నం నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ తీవ్ర వాయుగుండం శుక్రవారం సాయంత్రం 5.30 గంటల సమయానికి విశాఖపట్నం నుంచి దక్షిణ ఆగ్నేయంగా 300 కిలోమీటర్ల దూరంలో, పూరీకి 480 కిలోమీటర్ల దూరంలో ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
రాగల 6 గంటల్లో ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారొచ్చని.. శనివారం ఉదయం నాటికి ఉత్తరాంధ్ర – ఒడిశా తీరాలకు దిశగా కదిలే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అనంతరం ఆదివారం నాటికి ఇది పెను తుపానుగా మారి ఒడిశాలోని పూరీ సమీపంలో తీరం దాటొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఒక మోస్తరు వర్షాల నుంచి అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవొచ్చని… తీరం వెంబడి 45 నుంచి 65 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు.
శనివారం ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని, తీరం వెంబడి 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. గరిష్ఠంగా 110 కిలోమీటర్ల వేగం వరకు గాలులు వీయొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో సహాయక చర్యలకోసం ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు 11, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు నాలుగు రంగంలోకి దిగాయని, అదనంగా మరో నాలుగు బృందాలు అందుబాటులో ఉన్నాయని ఏపీ విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు.
మత్య్యకారులు ఆదివారం వరకు వేటకు వెళ్ళరాదని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉత్తరాంధ్రపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు మూడు, ఎస్‌డీఆర్ఎఫ్ సిబ్బంది 45 మంది సహాయ చర్యల కోసం సిద్ధంగా ఉన్నారని విశాఖ కలెక్టర్ మల్లికార్జున చెప్పారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బలగాలు విశాఖ నగరంలోని కైలాసగిరి దగ్గర రోడ్ మార్చ్ నిర్వహించాయి. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించాయి.
