దేశ రాజధాని నడిబొడ్డున లూటెన్స్ దిల్లీలో అత్యంత ప్రత్యేకమైన అక్బర్ రోడ్డులో ట్రాఫిక్ మామూలుగానే ఉంది. రోడ్డుకు రెండు వైపులా ఉన్న భవనాల్లో నివసించినవారికి, వచ్చిపోయేవారికి అక్కడున్న వేప, చింత, రావి చెట్లు సుదీర్ఘ కాలంగా సాక్షులుగా నిలిచాయి.
1931లో న్యూదిల్లీ ఆవిర్భవించిన తర్వాత అక్కడ జనాభా వృద్ధిని అవి చూశాయి. కానీ, ఇప్పుడు అక్కడి అక్బర్ రోడ్ పేరు మార్చాలనే డిమాండ్ మొదలైంది. ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ పేరును అక్బర్ రోడ్‌కు పెట్టాలని వీరంతా కోరుతున్నారు.
మొఘల్ చక్రవర్తి అక్బర్ స్మారకంగా ఈ రహదారికి పెట్టిన పేరు మార్చాలనే డిమాండ్ ఎప్పుడూ ఉంది. అలా కోరుకుంటున్నవారు ఈ రోడ్‌లో ఉన్న సైన్ బోర్డ్ మీద నల్ల రంగు కూడా వేశారు.
అయితే, ఇప్పుడు అక్బర్ రోడ్ పేరు కూడా మార్చేస్తారా. మనం వేచిచూడాల్సి ఉంటుంది. కానీ, ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. ఈసారి రాజకీయ వాతావరణం అందుకు అనుకూలంగానే ఉంది. ఎందుకంటే జనరల్ రావత్ అకాల మరణంతో అక్బర్ రోడ్ కాస్తా, జనరల్ రావత్ రోడ్‌గా మారితే. బహుశా పెద్దగా వ్యతిరేక గళాలేవీ వినిపించకపోవచ్చు.
