
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పేరుతో నకిలీ సిఫార్సు లెటర్లు, నకిలీ ఇమెయిల్ ఐడీలు, ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు పెరిగిపోవడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. ఇటీవలి రోజులలో, VIP దర్శనం కల్పిస్తామని నమ్మబలికి, నకిలీ లేఖలతో భక్తులను మోసం చేసే ఘటనలు వరుసగా వెలుగులోకి వచ్చాయి. భక్తుల విశ్వాసాన్ని దుర్వినియోగం చేస్తున్న ఈ మోసగాళ్లపై TTD విజిలెన్స్ విభాగం తీవ్రమైన దృష్టిసారించింది.
తిరుపతి పోలీసుల విచారణలో, కొంతమంది వ్యక్తులు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల పేర్లను దుర్వినియోగం చేస్తూ, వారి పేర్ల మీద నకిలీ సిఫార్సు లెటర్లు రూపొందించి భక్తులకు VIP దర్శనం ఏర్పాట్లు చేస్తామని వాగ్దానం చేసినట్లు బయటపడింది .
ఇటువంటి లెటర్లలో MP లు, MLA లు ఇంకా DGP స్థాయి అధికారుల పేర్లను కూడా వినియోగించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. భక్తుల నుంచి డబ్బులు తీసుకుని, దర్శనం ఇవ్వకపోవడం లేదా చివరకు మోసపూరితమైన పత్రాలు ఇచ్చి తప్పించుకోవడం వంటి ఘటనలు నమోదయ్యాయి.
ఇదే సమయంలో, TTD EO పేరుతో ఫేస్‌బుక్‌లో నకిలీ ప్రొఫైల్ కూడా బయటపడింది. అధికారిక ప్రొఫైల్‌లా కనిపించేలా చిత్రాలు, పదవిని ఉపయోగించి తయారు చేయబడిన ఈ ఖాతా ద్వారా భక్తులకు సందేశాలు పంపి, చెల్లింపులు కోరే ప్రయత్నాలు జరిగినట్లు TTD గుర్తించింది . దీనిపై విచారణ ప్రారంభమై, సంబంధిత వ్యక్తుల గుర్తింపు కోసం సైబర్ విభాగం చర్యలు చేపట్టింది.
మరో ఘటనలో, TTD అధికారిక ఇమెయిల్‌లాగా కనిపించే నకిలీ జీమెయిల్ ఐడీ ద్వారా భక్తులను మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన విషయం గుర్తించదగ్గది. గూగుల్ సెర్చ్‌లో అధికారిక ఐడీలతో పాటు కనిపించేలా ఈ నకిలీ ఐడీని రూపొందించి, VIP దర్శనం మరియు నివాసం కల్పిస్తామని భరోసా ఇచ్చి అనేకరిని మోసగించినట్లు విచారణలో బయటపడింది. ఫోన్ నంబర్‌ను ‘TTD JEO Office’ పేరుతో ట్రూకాలర్‌లో నమోదు చేసి నమ్మకం కలిగించే ప్రయత్నం కూడా చేసినట్లు పోలీసుల వివరాలు చెబుతున్నాయి.
ఈ ఘటనలన్నింటిపై స్పందించిన TTD విజిలెన్స్ విభాగం, ఏ విధమైన సిఫార్సు లెటర్లు, VIP దర్శనం వాగ్దానాలు, ఆన్‌లైన్ ఆఫర్లు నమ్మరాదని భక్తులకు హెచ్చరిక జారీ చేసింది. అధికారిక సమాచారం, బుకింగ్‌లు, దర్శనం టికెట్లు, సేవలన్నీ కేవలం TTD అధికారిక వెబ్‌సైట్ మరియు యాప్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. ఏవైనా అనుమానాస్పద లెటర్లు, ఇమెయిల్లు, సోషల్ మీడియా సందేశాలు వచ్చిన వెంటనే TTD విజిలెన్స్‌కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
తిరుమలలో రోజూ వేలాది మంది భక్తులు దర్శనం కోసం వచ్చే నేపథ్యంలో, నకిలీ లెటర్లు, నకిలీ ఐడీల ముప్పు పెరుగుతుండడం ఆందోళనకరమే. భక్తుల విశ్వాసాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తులపై TTD కఠిన చర్యలు తీసుకుంటూ, భవిష్యత్తులో ఇలాంటి మోసాలు జరగకుండా జాగ్రత్త చర్యలను మరింత బలపరుస్తోంది.
